ఇంటర్ కూడా పూర్తిచేయని సచిన్.. రామ్ ఆసక్తికర ట్వీట్

భారత క్రికెట్‌లో అతనో సంచలనం. క్రికెట్ దేవుడిగా పిలిపించుకున్న ఘనత అతని సొంతం. ఎంతో మంది క్రికెటర్లకు అతని జీవితమే ఓ పాఠ్యాంశం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు. అన్నింటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన ఏకైక ఆటగాడు. ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రికార్డుల వేటగాడు. ఆయనే భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్ కర్. నేడు(ఏప్రిల్ 24న) ఆయన పుట్టినరోజు. 1973 ఏప్రిల్ 24న జన్మించిన సచిన్‌కు నేటితో 46 ఏళ్లు నిండాయి. సచిన్ పుట్టినరోజు దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కూడా ఉన్నారు. సర్వసాధారణంగా కాకుండా కొత్తగా, ఆసక్తికరంగా రామ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మహత్యలు చేసుకుంటోన్న ఇంటర్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ట్వీట్ చేశారు. ‘పార్క్‌లో కూర్చుని బిస్కెట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. బెడ్‌రూమ్ లాక్ వేసుకుని లైఫ్ ఎలా రా అనుకునే పిల్లలకి.. నిజాలు.. ఇలా చెప్తేనే వింటారు. ఇంటర్ కూడా పూర్తి చేయని, దేశం గర్వించదగిన వ్యక్తి సచిన్ టెండూల్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే, ఇంటర్ కూడా పూర్తిచేయని సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్‌గా ఎదిగినప్పుడు.. ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటని పరోక్షంగా రామ్ ప్రశ్నించారు. సచిన్‌ను స్ఫూర్తిగా చూపించారు.

Related News
